Bright Telangana
Image default

Fifa World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా అర్జెంటీనా.. నెరవేరిన మెస్సీ కల

argentina won

Fifa World Cup 2022 : ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా గెలుపొందింది. ఈ విజయంతో అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. గతంలో ఈ జట్టు 1978, 1986లో విజేతగా నిలిచింది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా తొలిసారి కప్పు నెగ్గింది.

దీంతో.. తన కెప్టెన్సీలో అర్జెంటీనాకు కప్ తెచ్చిపెట్టాలన్న మెస్సీ కల నెరవేరింది. కాకపోతే.. ఈసారి మెస్సీ గోల్డెన్ బూట్‌ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌కి ముందు వరకు మెస్సీ, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే చెరో 5 గోల్స్‌తో సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేయగా, ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

మొదట్లో ఈ పోరులో అర్జెంటీనా ఆధిపత్యం సాధించింది. 23వ నిమిషంలో పెనాల్టీని మెస్సి గోల్‌గా మలచగా.. 36వ నిమిషంలో ఏంజెల్ డీ మారియా మరో గోల్ చేశాడు. దీంతో.. తొలి సగభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ.. రెండో అర్ధభాగంలో మాత్రం ఫ్రాన్స్ పుంజుకుంది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు ఎంబాపే 80వ నిమిషంలో పెనాల్టీ కిక్ ద్వారా ఒక గోల్, ఆ వెంటనే 81 నిమిషంలో గోల్‌ చేసి.. స్కోరుని 2-2గా సమం చేశాడు. అప్పుడు ఇరు జట్లు మరో గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి కానీ.. నిర్ణీత సమయం ముగిసింది.

దీంతో అదనపు సమయం కేటాయించారు. మళ్లీ ఇరు జట్లు బరిలోకి దిగా.. 108 నిమిషాల వద్ద మెస్సీ గోల్ చేశాడు. దాంతో 3-2 తేడాతో అర్జెంటీనా మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. మ్యాచ్ ముగియడానికి మరో రెండు నిమిషాలు మాత్రమే ఉన్నప్పుడు, అంటే 118 నిమిషాల వద్ద ఎంబాపే ఊహించని షాకిచ్చాడు. పెనాల్టీని అతడు గోల్‌గా మలిచాడు. దీంతో మళ్లీ స్కోరు 3-3తో సమం అయ్యింది.

అదనపు సమయం అయిపోవడం, ఇరు జట్ల స్కోరు సమయంగా ఉండటంతో.. పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ రౌండ్‌లో అర్జెంటీనా వరుసగా నాలుగు బంతుల్ని గోల్స్‌గా మలచగా.. ఫ్రాన్స్ కేవలం రెండు బంతుల్ని గోల్స్‌గా మారింది. దీంతో.. ఈ మ్యాచ్ అర్జెంటీనా వశమైంది. ఎప్పట్నుంచో కంటున్న కల ఈ మ్యాచ్‌తో నెరవేరడంతో.. ప్రపంచవ్యాప్తంగా లియోనెల్ మెస్సీ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరైతే సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.