England Win by 10 wickets to reach T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (40 బంతుల్లో 50) నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా.. హార్దిక్ పాండ్య (33 బంతుల్లో 63) ఆఖర్లో దూకుడుగా ఆడటంతో 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీలతో 170 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి చిరస్మరణీయ విజయాన్నందించారు. హేల్స్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. బట్లర్ సైతం దూకుడుగా ఆడి 36 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఓపెనర్ల హిట్టింగ్‌తో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. పది ఓవర్లలో 98/0గా నిలిచింది. బౌలర్ ఎవరనే దానితో సంబంధం లేకుండా బట్లర్, హేల్స్.. దాదాపుగా ప్రతి ఓవర్లోనూ బౌండరీ బాదారు.
169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు ఊదిపడేశారు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.. ఈ మెగా టోర్నీలోనే టీమిండియాకు ఇది అత్యంత ఘోర పరాజయం. జోస్ బట్లర్, హేల్స్ ధాటికి టీమిండియా బౌలర్లు పోటాపడీ పరుగులిచ్చుకున్నారు. మైదానంలో రోహిత్ ఎన్ని వ్యూహాలు పన్నినా ఈ జోడీని విడదీయలేకపోయాడు. దాంతో మరోసారి టీమిండియా టైటిల్ లేకుండానే ఇంటిదారిపట్టింది.