Ind vs SA 1st T20 : తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా(Team India) ఘనవిజయం సాధించింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపు రుచి చూసింది. రోహిత్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ 3 పరుగులకే అవుటై నిరాశపరిచినా కేఎల్ రాహుల్ (51 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగి టీమిండియా(Team India)కు విజయాన్ని అందించారు. కేఎల్ రాహుల్ తొలుత టెస్ట్ ఆటను ఆడినా తర్వాత వేగంగా ఆడాడు. అతడు 56 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. సూర్యకుమార్ మరోసారి అదరగొట్టాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సఫారీ బౌలర్లలో రబాడ, నార్జ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
అంతకుముందు టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన టీమిండియా.. గ్రీన్ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్‌లోనే దీపక్ చాహర్ వికెట్ల పతనానికి నాంది పలికాడు. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు బుట్టలో వేసుకున్నాడు. అయితే అతి తక్కువ బంతుల్లో తొలి 5 వికెట్లు కోల్పోయిన జట్టుగా సౌతాఫ్రికా జట్టు చెత్త రికార్డును నెలకొల్పింది. మార్‌క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహరాజ్ (41) పోరాడారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు 3 వికెట్లు పడ్డాయి. అటు దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు.