Bright Telangana
Image default

Gadala Srinivas: హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఏసుక్రీస్తు వల్లే కరోనా తగ్గింది

Health Director DH Srinivasa Rao Controversial Comments On India Development

Health Director DH Srinivasa Rao Controversial Comments On India Development : ఏసుక్రీస్తు వల్లే కరోనా మహమ్మారి అంతమైందని.. వైద్యులిచ్చిన మెడిసిన్స్ వల్ల కాదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా. గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల్ని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఏసుక్రీస్తు వల్లే ఇండియా అభివృద్ధి చెందిందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదని మండిపడింది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి.. మతాలను ప్రేరేపించేలా, కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసేలా, హిందువులను కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదని తీవ్రంగా హెచ్చరించింది.

హిందుత్వాన్ని, వైద్య విధానాన్ని, సైన్స్‌ను, శాస్త్రవేత్తలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవజాతికి ఏసుక్రీస్తు మాత్రమే దైవమని.. మిగతా దేవుళ్ళందరూ గ్రాఫిక్స్ అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. దీనిని ప్రతి హిందువు తప్పు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏసుక్రీస్తు వల్లే ఇండియా అభివృద్ధి సాధించిందని ఆయన మాట్లాడటంలో అసలు అర్థం ఉందా? అని నిలదీశారు. అసలు ఏసుక్రీస్తుకి, దేశ అభివృద్ధికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. లక్షల మంది వైద్యులు, శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తే గాని కరోనా అదుపులోకి రాలేదన్న విషయాన్ని శ్రీనివాస్ విస్మరించడం.. ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనం అని ఆరోపించారు.

తమ డిపార్ట్మెంట్‌లోని ఉద్యోగులను హిందువుల, క్రైస్తవులుగా విభజించి.. క్రైస్తవులకు మేలు కలిగే విధంగా శ్రీనివాస్ మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ పేర్కొంటోంది. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని తప్పుపట్టింది. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం నేరం కాదా? అని ప్రశ్నించింది. గతంలోణూ మూఢనమ్మకాల పేరుతో పూజలు నిర్వహించి, వైద్య విధానాన్ని అభాసుపాలు చేసే విధంగా శ్రీనివాస్ వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు చెప్పారు. వెంటనే శ్రీనివాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వాళ్లు హెచ్చరించారు.