Queen Elizabeth 2 Passes Away at 96 : బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) కన్నుమూశారు. గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్కాట్ లాండ్ లోని బాల్మోరల్ కోటలో ఆమె మరణించారు. గత ఏడాది అక్టోబర్ లో రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చారు. ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆమెని పర్యవేక్షించింది. అయినా ఫలితం లేకుండా పోయింది.
బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌కు 70 ఏళ్లుగా రాణిగా కొనసాగుతున్నారు. ఆమె హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానులు పనిచేశారు. రాణి ఎలిజబెత్ 2 అస్తమయంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసినట్లైంది.
యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటుగా 14 దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న థాయ్‌లాండ్ రాజు భూమి బోల్ అదుల్యదేజ్ (1946-2016 మధ్య 70 ఏండ్ల 126 రోజులు పాలన చేశారు)ను ఎలిజబెత్-2 దాటేశారు. మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కి చెందిన లూయిస్-14 (1643-1715 మధ్య కాలంలో 72 ఏండ్ల 110 రోజులు) ఉన్నారు. 2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసనాన్ని అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఒకవేళ అనారోగ్యంతో గనుక ఆమె మరణిస్తే ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటిస్తారు. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో ఇప్పటికే సిద్ధపడ్డారు అధికారులు. ఎలిజబెత్-2 తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్-3 పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.