వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ పై పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రొఫైల్ ప్రైవసీ సెట్టింగ్స్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, పేమెంట్ వెరిఫికేషన్, బ్యాకప్ డేటా వంటి అధునాతన ఫీచర్లను మన ముందుకు తీసుకొచ్చింది. త్వరలో యూజర్ల కోసం ప్రైవసీకి సంబంధించిన మరో కొత్త అప్డేట్ను వాట్సప్ తీసుకురానుంది. ఇందులో భాగంగా వాట్సప్ స్టేటస్ మాదిరిగానే లాస్ట్ సీన్‌కు కూడా మరో కొత్త ఆప్షన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం లాస్ట్సీన్కు ఉన్న ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ ఆప్షన్లకు తోడుగా ‘ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్‌ను జత చేయనుంది. ఈ సదుపాయంతో యూజర్లు అనుమతించిన వారు మాత్రమే లాస్ట్సీన్ని చూసే అవకాశం ఉంది.
గతంలో వాట్సాప్ యూజర్ తన లాస్ట్‌సీన్‌ను ఎవరైనా చూడొచ్చనుకుంటే ‘ఎవ్రీవన్’, కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులు మాత్రమే చూడాలనుకుంటే ‘మై కాంటాక్ట్స్’, ఎవరూ చూడకూడదనుకుంటే ‘నోబడీ’ ఆప్షన్లను ఎంచుకునేవాళ్లు. అయితే నిర్ధిష్ట వ్యక్తి మన లాస్ట్ సీన్‌ను చూడకూడదనుకుంటే కొత్తగా వస్తోన్న ‘ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ను ఎంచుకుని ఎవరైతే లాస్ట్ సీన్ చూడకూడదని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరును సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సదుపాయాన్ని త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సప్ బీటా ఇన్ఫో తెలిపింది. అదేవిధంగా ఇదే సదుపాయాన్ని ప్రొఫైల్ పిక్కు కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.