తెలంగాణ : బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తుంటే తెలంగాణలో ఎందుకు తగ్గించరని విజయశాంతి నిలదీశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి చెందడంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక చిన్న ఎన్నిక అయితే అక్కడ రూ.వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని సీఎం కేసీఆర్‌ను విజయశాంతి నిలదీశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని పేర్కొన్నారు. రైతులపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లినప్పుడు రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. హిందూ ద్వేషి అయిన ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న కేసీఆర్.. బీజేపీని మాత్రం గొడవలు పెట్టే పార్టీ అని చెప్పడం నిజామీ రజాకార్లకు సలాం చేసే స్వభావాన్ని బహిర్గతం చేస్తోందని విజయశాంతి విమర్శలు చేశారు.