ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మ కోసం ఆదివారం మహబూబ్ నగర్ వెళ్లొచ్చిన సీఎం.. సాయంత్రం అకస్మాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో వివాదాస్పదంగా మారిన వరి సాగు అంశంతోపాటు అనేక రాజకీయ చర్చలపైనా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరిని వద్దంటున్నది కేంద్రమే అని, ఢిల్లీలోని బీజేపీ ఒకలా మాట్లాడుతోంటే, సిల్లీ బీజేపీ నేతలు ఇంకోలా వాగుతున్నారంటూ స్థానిక బీజేపీ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. సంజయ్‌కు నెత్తిలేదు, కత్తిలేదంటూ ఫైరయ్యారు. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ అంటున్నాడని.. అంత ధైర్యం ఉన్నవాళ్లు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. టచ్ చేస్తే తమ పవర్ ఏంటో తెలుస్తుందన్నారు. నాలుక ఉంది కదా అని మాట్లాడితే మెడలు విరుస్తామన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిదంటున్న బండి సంజయ్ దమ్ముంటే తన మీద కేసు పెట్టాలన్నారు. అక్షరం ముక్కరాదు. హిందీ రాదు.ఇంగ్లీష్ ముక్క రాదు… కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే జీవోలు వీరికి అర్థం కావన్నారు. కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి రాష్ట్రానికి బండి సంజయ్ ఏం చేశాడని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిన్నాపెద్దా ఏమీ లేదా? ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అనేక విషయాల్లో కేంద్రంలో మీ ప్రభుత్వం ఫెయిలవలేదా? అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. మేమిచ్చిన డబ్బుతోనే కేంద్రం నడుస్తోంది. గుర్తుంచుకోండి అంటూ స్టేట్ బీజేపీ లీడర్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కిషన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర మంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలని సూచించారు. ‘నేను కూడా కూడా కేంద్ర మంత్రిగా పని చేశా.. పెద్ద పదవి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. హుజురాబాద్‌లో కిషన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.