గులాబ్ తుఫాన్‌తో నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉయదం వరకు కుండపోత వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 140.7 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జక్రాన్‌పల్లిలో 23.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిరికొండలో 209. 8మి.మీలు, బోధన్‌లో 209.5 మి.మీల వర్షం కురిసింది. అతి తక్కువగా వర్ని మండలంలో 63.0 మి.మీ.ల వర్షం కురిసింది. మోర్తాడ్, భీంగల్, సిరికొండ, ఏర్గట్ల, మోప్కాల్, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పూలాంగ్, కప్పలవాగు, పెద్దవాగు, గోన్‌గొప్పులవాగు, ముత్తాయికుంట వాగులు పొంగి ప్రవహించాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలోని ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. నగరంలోని బైపాస్ రోడ్డులో గల కొత్త కలెక్టరేట్ ప్రాంతం చెరువును తలపించింది. న్యాల్‌కల్ రోడ్డుతో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయు.
పలు గ్రామాల పరిధిలో పాత ఇళ్లు నేలకూలాయి. చాలా మండలాల పరిధిలో కల్వర్టులు, రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండల పరిధిలో పలు రోడ్లు కోతకు గురయ్యాయి. పెద్దవాగుకు భారీ వరద రావడంతో మోర్తాడ్ వద్ద రైల్వే బ్రిడ్జిని తాకుతూ వరద పారింది. భీంగల్ మండలంలోని గోన్‌గొప్పుల వాగు పొంగడంతో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు లారీలోని డ్రైవర్‌ను కాపాడారు. నిజామాబాద్ రూరల్ మండలం పరిధిలోని ముత్తాకుంట బాలమ్మ వాగులో లారీ ఇరుక్కుపోగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురిని గ్రామస్థులు కాపాడారు. సిరికొండ మండలం నర్సింగ్‌పల్లిలో వైకుంఠధామం నేలకూలింది. మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వరద కాల్వ బ్రిడ్జిని తాకుతూ పారింది. చాలా యేళ్ల తర్వాత అక్కాచెళ్లెల్లుగా పిలవబడే జక్రాన్‌పల్లి పెద్దచెరువు, పడకల్ పెద్దచెరువు నిండాయి. సిరికొండ మండలం గడ్కోల్ వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు వరదలతో దెబ్బతిన్నది. సిరికొండ మండలం కప్పలవాగు చెక్‌డ్యాంకు భారీ వరదలు రావడంతో తెగిపోయింది.