Sudhanshu Pandey – న్యూఢిల్లీ : దేశంలోని ఏ రాష్ట్రం నుంచి కూడా బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయదని స్పష్టం చేస్తూ సోమవారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసనపై బీజేపీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా సుధాంశు పాండే మాట్లాడుతూ.. ప్రస్తుతం పంజాబ్‌తో సహా ఏ రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేయడం లేదని, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తెలంగాణలో ఎందుకు ఈ సమస్య తలెత్తుతోందని అన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సమస్య లేదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికే సేకరణ విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన ప్రకటించారు.
ధాన్యం కొనుగోళ్లపై గత కొన్ని నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తానికి ఉమ్మడి సేకరణ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చివరి అస్త్రంగా టీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో కలిసి ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట ధర్నాకు దిగారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి, వాటిని రద్దు చేయడంలో విజయం సాధించిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్, ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు టీఆర్‌ఎస్ నిరసనలో చేరారు. కానీ, వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ పై కేంద్ర ప్రభుత్వ ప్రకటన టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ చిచ్చును మరింత పెంచే అవకాశం ఉంది.