తెలంగాణ – హైదరాబాద్: త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి వచ్చింది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు చేసింది. డీజిల్ రేట్ల తగ్గింపు నేపథ్యంలో పెంపు ప్రతిపాదనలను సవరించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఇతర ఆఫీసర్లతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం సమీక్ష జరిపారు. చార్జీల పెంపుపై చర్చించారు. ఎంత ఆదాయం వస్తోంది, ఎంత నష్టం వాటిల్లుతోంది, డీజిల్ రేట్ల తగ్గింపు వంటివాటిపై ఆరా తీశారు.
నిజానికి ఆఫీసర్లు 2 నెలల క్రితమే చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించారు. అన్ని రకాల బస్సుల్లోనూ కిలోమీటర్‌కు 35 పైసలు పెంచాలని సూచించారు. కానీ తాజాగా కేంద్రం డీజిల్‌పై లీటర్ పై రూ.10 తగ్గించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్జీలు అంత భారీగా పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, ఆక్యుపెన్సీ తగ్గే ప్రమాదమూ ఉందని అధికారులు వివరించారు. దాంతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్, ఆపై బస్సుల్లో 30 పైసలు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. తద్వారా ఆర్టీసీకి ఏటా 700 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా ? లేదా ? అనేది చూడాలి.
కనీస చార్జీల పెంపు ఇలా..
బస్సు | ప్రస్తుతం | ప్రతిపాదించినది |
ఎక్స్‌ప్రెస్ | 15 | 20 |
డీలక్స్ | 20 | 25 |
సూపర్ లగ్జరీ | 25 | 30 |
గరుడ ప్లస్ | 35 | 40 |