Multi Super Speciality Hospital in Warangal : వరంగల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 11 వందల కోట్ల రూపాయలను విడుదలకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
వరంగల్‌లో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2వేల పడకలతో నిర్మించనున్న దవాఖానకు రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్కు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. టీఎస్‌ఎంఐడీసీ, డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశించారు.
వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆసుపత్రి నిర్మాణానికి వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో జూన్ 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 15 ఎకరాల్లో 24 అంతస్థుల్లో భారీ ఆసుప్రతి నిర్మాణం జరుగనున్నది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు.