వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తలపెట్టిన వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన కూడా రద్దయింది. వరంగల్ పర్యటనలో భాగంగా ఔటర్ రింగు రోడ్డు, మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి, వరంగల్, హన్మకొండ జంట నగరాల్లో రవాణా, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులపై సీఎం సమీక్షకు ఏర్పాట్లు చేశారు. హన్మకొండ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు పార్టీ నేతలు సన్నా హాలు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దు నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి రావడంతో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. తిరిగి ఎప్పుడు వెళతారనేది త్వరలో వెల్లడిస్తామని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం కేసీఆర్ పర్యటన రద్దుతో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. కాగా, ఈ నెల 29న వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ విజయగర్జన బహిరంగ సభను కూడా టీఆర్‌ఎస్ పార్టీ వాయిదా వేసింది.