ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ మూవీల నిర్మాతలకు షాక్ తగిలినట్టే. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పసరి చేస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్ ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశ పెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్ లో ఇకనుంచి టికెటింగ్ కు అనుమతి లేదు. సీఎం జగన్ తరపున బిల్లును ప్రవేశపెడుతూ.. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బిల్లు ప్రకటనను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..
జీవో 35 ప్రకారం బెనిఫిట్ షో లకు ప్రత్యేక అనుమతి ఉంటుందని..అది కూడా చారిటీస్ కోసం మాత్రమే అనుమతి ఇస్తామని ఆయన వివరించారు. చట్టం ప్రకారం ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శన లు మాత్రమే చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. సులభతరంగా మూవీ టికెట్ల విక్రయం జరిగేలా ఈ ప్రక్రియ ఉంటుందని… 1100 థియేటర్లలో ఆన్ లైన్ లో విక్రయం చేపడతామని ప్రకటనచ చేశారు.
మూవీ రిలీజ్ ల సమయంలో అధిక ధరలకు టికెట్లు విక్రయం చేయకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని… ఇక నుంచి బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా నిబంధనలు తయారు చేశామన్నారు. 200 నుంచి 1000 రూపాయల వరకు టికెట్లు బ్లాక్ లో విక్రయించే విధానం ఉండేదని… ప్రజల నుంచి దోచుకునే పరిస్థితి ని నియంత్రణ చేసేందుకు ఈ ప్రక్రియ ఉంటుందన్నారు.