ఖమ్మం జిల్లా : వైరా మండలంలో గులాబ్ తుఫాన్ వలన సోమవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలతో పంటలు, రిజర్వాయర్ కుడి, ఎడమకాల్వ గట్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. గరికపాడు తదితర గ్రామాల్లో కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. నీటిపారుదలశాఖ ఈఈ కె.శ్రీనివాసాచారి, వైరా డీఈఈ పి.శ్రీనివాస్, సిబ్బంది మంగళవారం కుడి, ఎడమకాల్వలపై పర్యటించి వరదలతో కొట్టుకుపోయిన కాల్వ గట్లను పరిశీలించారు. ఎడమకాల్వ పూసలపాడు, విప్పలమడక, గరికపాడు, పలుచోట్ల గండ్లు పడ్డాయి.
350ఎకరాల్లో వరి, మిర్చి ఇతర పంటలు వరద వలన దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఏవో ఎస్.పవన్‌కుమార్, ఏఈవోలు ఆయా గ్రామాల్లో పర్యటించి పంటలు ప్రాథమిక అంచనా వేశారు. మాగాణి భూముల్లో గట్లకు గండ్లు పడ్డాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన వైరా-జగ్గయ్యపేట, మధిర రూట్‌లో సోమవరం-వైరా మధ్య రోడ్డు కోతకు గురైంది. అలాగే పాలడుగు-గన్నవరం రూట్లో, పాలడుగు-వల్లాపురం రోడ్డు, అలాగే రెబ్బవరం-నెమలి రూట్లో గన్నవరం కాజ్‌వే వద్ద రోడ్లు దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీ ఏఈఈ భగవాన్‌నాయక్ రోడ్లపై పర్యటించి అంచనాలు వేశారు. ట్రాన్స్‌కో అధికారులు కూడా పొలాల్లో విరిగిన కరెంట్ స్తంభాలకు ప్రాథమిక అంచనాలు వేశారు. పలు గ్రామాల్లో వరదల వలన మిషన్ భగీరథ పైపులైన్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.