తిరుపతి సమీపంలోని రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. 15వ శతాబ్దం నాటి చెరువు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. లీకేజీలు కూడా కనిపించాయి. ఓ చోట గండిని అధికార యంత్రాంగం పూడ్చివేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు. ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి.
గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి సమీపంలోని 20 గ్రామాల ప్రజలు ఎవరు ఇళ్ళలో ఉండకండి. రెండు అంతస్తుల భవనంలో కూడా ఎవరు ఉండకండి. పరిస్థితులు బాగాలేదు… కాబట్టి ముందుగానే ప్రజలను అప్రస్తుతం చేస్తున్నాం.. ప్రజలు తప్పనిసరి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ఇరిగేషన్ అధికారులు పరిశీలించి చర్యలు చేపడుతున్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో వున్నాయి అని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా ఇంకా ముంపులోనే మగ్గుతోంది. వందలాది గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో నానుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయ్. నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి.