తెలంగాణ : కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. తెలంగాలోని రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని.. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్, ఇందిరాపార్క్ దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా..? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు. బీజేపీ నేత బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. 19వ తేదీ నుంచి 23 వరకు కళ్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. ఈ నెల 23 వరకు సీఎం కేసీఆర్‌కు సమయం ఇస్తున్నామని, తర్వాత రైతులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రైతు సమస్యలపై ప్రధాని మోదీని నిలదీయాలని రేవంత్ డిమాండ్ చేశారు.