‘ఇంతకు ముందు కూడా ఎన్నో సమస్యలొచ్చాయి, పోయాయి. ఇది కూడా అలాగే పోతుంది’ అని అంటున్నారు హీరో వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం-2’. 2014లో విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీ సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ టీజర్‌ని శుక్రవారం మూవీ యూనిట్ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసింది. ఇందులో రాంబాబుగా వెంకటేశ్, ఆయన సతీమణిగా మీనాల నటన ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు’’ అంటూ వెంకీ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇన్ని రోజులు ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలవుతుందా లేక ఓటీటీలో విడుదలవుతుందా అనే విధంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 2’ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే, నవంబరు 25న ఈ మూవీ అమెజాన్ ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వెంకీ గత మూవీ ‘నారప్ప’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై హిట్ సాధించింది. ఇప్పుడు ‘దృశ్యం 2’ కూడా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతుంది.