హుజురాబాద్ ప్రజలు తమ ఓపీనియన్‌ను చెప్పే టైం వచ్చింది. శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. శనివారం పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని సర్వసన్నద్ధమయ్యారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు లక్షా 19వేల 102మంది, పురుషులు లక్షా 17వేల 993మంది ఉన్నారు.
అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు శనివారం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఓటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను, వీవీ ప్యాట్లను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు తరలిస్తారు. వీటిని భద్రపరిచేందుకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 2న ఇక్కడే ఓట్ల లెక్కింపు జరగనున్నది.
గత ఎన్నికల్లో 84.42 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. పార్టీలు సైతం పెద్దయెత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్.