తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఈరోజు వెల్లడికానున్నది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, ముందుగా వాటిని లెక్కించనున్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేయగా హాలుకు 7 టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లు సిద్ధం చేశారు. ఫలితాలు సాయంత్రం 4 గంటలకు వెలువడే అవకాశం ఉంది.
ఆయా మండలాలవారీగా మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంలే కాబట్టి ఒక్కో రౌండ్ లెక్కింపునకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కౌంటింగ్ కేంద్రంలో కొవిడ్ ప్రోటోకాల్స్ అమలులో ఉన్నందున లెక్కింపు ప్రక్రియ కొంత నిదానంగా సాగొచ్చు. కౌంటింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించాలి, ఫలితాలను ఎలా వెల్లడించాలనేదానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సోమవారం నాడు జిల్లా ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు.