మెగాస్టార్ చిరంజీవి మూవీలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించే అవకాశాలున్నాయంటూ ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. వీటిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పష్టతనిచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కలిసి నటిస్తున్నారని వెల్లడించారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళ చిత్రం ‘లూసీఫర్’ రీమేక్‌గా రూపొందుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులోనే సల్మాన్‌ఖాన్ కనిపించనున్నారు. అంతేకాదు ఈ ఇద్దరూ కలిసి ఓ హుషారైన గీతానికి డ్యాన్స్ చేయబోతున్నారని, ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌తో ఈ పాటని పాడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తమన్ తెలిపారు. ఆమెతో తెలుగు పాట పాడించాలా? ఇంగ్లిష్ సాంగ్ పాడించాలా? అనే విషయంలో ఇంకా స్పష్టతరాలేదన్నారు తమన్.
ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకురానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ప్రకటించిన ‘భోళా శంకర్’ మూవీ గురువారం పట్టాలెక్కింది. వీటితోపాటు దర్శకుడు బాబీతో చిరంజీవి ఓ మూవీ చేస్తున్నారు.