టీ20 వరల్డ్ కప్ 2021: టోర్నీలో అఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 130 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చెలరేగారు. పరుగుల వరద పారించారు. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది అఫ్గానిస్తాన్.
191 పరుగుల టార్గెతో బరిలోకి దిగిన స్కాట్లాండ్.. 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్కాట్లాండ్ జట్టులో ఐదుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రెహ్మాన్ 5 వికెట్లు, రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసి స్కాట్లాండ్ వెన్ను విరిచారు. నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీశాడు. 10.2 ఓవర్లలోనే 60 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌట్ అయ్యింది.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అఫ్గనిస్తాన్ తొలిసారిగా ఎలాగైతే భారీ స్కోర్ చేసిందో.. అలాగే మొట్టమొదటిసారిగా అంతే భారీ విజయం కూడా సొంతం చేసుకోవడం విశేషం. అఫ్గానిస్థాన్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.