ఆంధ్రప్రదేశ్ : వంట ఏదైనా ఒక్క టమాటా అందులో వేస్తే ఆ రుచే వేరు. కూర వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కాంబినేషన్ టమాటా ఉండాల్సిందే. పేరుకు పండే అయినా కూరగాయాల్లో అదే టాప్. అందుకే మార్కెట్లో టమాటాకు చాలా డిమాండ్ ఉంటుంది. అయితే, టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. గత నెలలో గరిష్ఠంగా కిలో 30 రూపాయలు పలికిన టమాటా ధర.. బహిరంగ మార్కెట్‌లో 40 రూపాయల వరకు అమ్ముడు పోయింది.. అయితే, వర్షాలతో టమాటా పంట దెబ్బతినడంతో.. మార్కెట్‌కు వచ్చే పంట కూడా తగ్గిపోయింది.. దీంతో టమాటా ధర క్రమంగా పైపైకి కదులుతోంది..
ఆంధ్రప్రదేశ్ లో టమాటాకు కేరాఫ్ అడ్రస్ అయిన చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటా రేటు ఏకంగా 100 రూపాయలు దాటేసింది. మార్కెట్లో 28 కిలోల టమాటా కేట్ ను ఏకంగా రూ.2,800 కు అమ్ముడుబోవడంతో రైతులు ముక్కున వేలేసుకున్నారు. మార్కెట్లో గ్రేడ్ ఏ టమాటా రూ.60 నుంచి రూ.100 పలకగా.. గ్రేట్ బీ కిలో రూ.16 నుంచి రూ.58 పలికింది. అయితే, మదనపల్లె మార్కెట్‌లోనే ఇలా ఉంటే.. ఇక, బహిరంగ మార్కెట్‌లో టమాటా ధర మరింత ఎక్కువగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతుండగా.. టమాటా వేసిన రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. వేసిన పంటలో చాలా వరకు పాడైనా.. మిగిలిన పంటతోనైనా గట్టెక్కే అవకాశం ఉందంటున్నారు.