ఆంధ్రప్రదేశ్ (కృష్ణాజిల్లా) : ఏపీలో రోజూ నాలుగు షోలకు మించకూడదు, బెని ఫిట్ షోస్ అసలు వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణ నటించిన ‘అఖండ’మూవీ బెనిఫిట్ షో వేశారనే కారణంతో రెవెన్యూ అధికారులు కృష్ణాజిల్లా మైలవరం సంఘమిత్ర థియేటర్‌లోని ఒక స్క్రీన్‌లో ప్రదర్శనను గురువారం నిలిపివేశారు.
జీవో.35 ప్రకారం రోజులు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉండగా యాజమాన్యం ఉదయం 8.00గంటలకు బెన్‌ఫిట్ షో వేసింది. థియేటర్‌లో రెండు స్క్రీన్లు ఉండగా.. నిర్ణీత సమయం కంటే ముందుగా షో వేసిన ఒక స్క్రీన్‌ను మాత్రమే సీజ్ చేసినట్లు చెప్పారు అధికారులు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు థియేటర్ తెరవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు.
దీనితో పాటు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి లోగల ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్‌లో తనిఖీలు చేసిన రెవెన్యూ అధికారులు బెనిఫిట్ షో ప్రదర్శించినట్లు తెలియడంతో ఆ థియేటర్‌ను కూడా సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అనుమతులు లేకుండా ప్రదర్శించిన థియేటర్స్ అన్నింటికి నోటీసులు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు రెవెన్యూ అధికారులు.