బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించారు ఐఎండీ అధికారులు. ఇది నవంబర్ 15 నాటికి ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం వైపు వెళ్లి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి నవంబర్ 18 నాటికి ఏపీ తీరానికి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా నవంబర్ 16 నుంచి 18 మధ్య చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరాలతో పాటు పశ్చిమ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో పలు జిల్లాల్లో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులపాటు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య తూర్పు బంగాళాఖాతం దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. ఇక అటు తమిళనాడు లోని చెన్నై లోనూ భారీ వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది.