హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలతో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. చివరి గంటలో కోవిడ్ బాధితులు పీపీఈ కిట్లతో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
హుజూరాబాద్..
హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరుపున కూడా ఆ పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు. 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లల్లో మహిళలు లక్షా 17 వేల 563 మంది, పురుషులు లక్షా 18వేల 720 మంది ఉన్నారు. అధికారులు 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని మోహరించారు.