జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఊహించిన దానికంటే కాస్త తక్కువ స్పందనే వస్తుంది. ఈ షోలో ఇప్పటి వరకు కోటి రూపాయలు గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. హిందీలో కోటి గెలిచారు కానీ మన దగ్గర మాత్రం ఎవరు మీలో కోటీశ్వరులులో ఆ ఫీట్ సాధించిన కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరు.
ఈ క్రమంలోనే తెలుగు టెలివిజన్ రంగంలో మొట్టమొదటి సారి ఓ కంటెస్టెంట్ రూ.1 కోటి రూపాయలు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో మొదటి సారి ఈ అద్భుతం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్ రాజు–శేషుకుమారి దంపతుల కుమారుడు రాజారవీంద్ర డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల షోలో పాల్గొన్న ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూ.కోటికి సంబంధించిన ప్రశ్న అంటూ జూనియర్ ఎన్టీఆర్ రవీంద్రను అడగ్గా.. సమాధానం చెప్పి ఫిక్స్ చేయండి అంటూ రవీంద్ర మాట్లాడిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉండగా.. రవీంద్ర నగదు గెలుచుకున్న విషయాన్ని షో నిర్వాహకులు ధ్రువీకరించాల్సి ఉంది.