చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే సీతారామశాస్త్రి కన్నుమూయడం అత్యంత విషాదకరం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆరు రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో ఆయన అభిమానులు, శోకసంద్రంలో మునిగిపోయారు. తెలుగు సినీపరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్తతకు గురయ్యారనే విషయం తెలుసుకున్పప్పటి నుంచి అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనకు ఏమైంది అంటూ ఆరా తీసారు. అందులోనూ శ్వాసకోస సంబంధిత సమస్యలున్నాయని.. న్యూమోనియాతో హాస్పిటల్ పాలయ్యారని తెలిసి కంగారు పడ్డారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతూ ఉన్నా.. సడెన్‌గా ఆయన తీవ్ర అస్వస్థతకు గురకావడం.. ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడం ఆయన పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలిచివేసిందనే చెప్పాలి.