అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. అయితే భారత్ నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఆయా దేశాలు ప్రత్యేక జెర్సీలు రూపొందించుకుంటున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గొనే జట్లు అన్నీ ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇండియా 2021’ అనే లోగో ఉన్న జెర్సీలను మాత్రమే ధరించాల్సి ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తన వక్ర బుద్దిని మరోసారి చూపించుకుంది. తమ జెర్సీపై ‘ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ యుఏఈ 2021’ అని రాసింది. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. దీనికి సంబంధించి నెట్టింట తెగ చర్చలు జరగుతున్నాయి. పాకిస్తాన్ జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పిసీబి ఇంకా అధికారికంగా జెర్సీని ఆవిష్కరించాల్సి ఉంది.
క్వాలిఫైయింగ్ రౌండ్‌లో పాల్గొనున్న జట్లు ఇప్పటికే టోర్నమెంట్ కోసం తమ జెర్సీని అధికారికంగా ఆవిష్కరించాయి. కొన్ని రోజుల క్రితం తమ జెర్సీని విడుదల చేసిన స్కాట్లాండ్ కూడా తమ జెర్సీపై ‘ఇండియా 2021’ అని రాసింది. కాగా భారత్‌లో కరోనా కారణంగా యూఏఈ, ఒమన్ వేదికల్లో టీ 20 ప్రపంచ కప్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే.