తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ : తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచేందుకు థియేటర్లకు అనుమతిచ్చింది. టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ మల్టీప్లెక్స్ లు, థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. అఖండ, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ కు టికెట్ రేట్లు పెంచుతామని థియేటర్ల యాజమన్యాలు తెలిపాయి. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలంటూ విజ్ఞప్తి చేశాయి. అయితే.. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే.. థియేటర్ల యాజమాన్యాలు పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. ఒక్కో టికెట్‌పై రూ.50 మేర పెంచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో హైకోర్టు ఉత్తర్వులతో భారీ బడ్జెట్ మూవీస్ టికెట్ రేట్లు పెరగనున్నాయి. అయితే.. ఇప్పటికే ఉన్న ధరలకు అదనంగా మరో రూ.50 వరకు టికెట్ రేట్లు పెరగనున్నాయి.
మరోవైపు, తెలంగాణలో మూవీ టికెట్ రేట్లు భారీగా పెరగనుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రెండున్నర గంటల వెండితెర వినోదాన్ని మాత్రం కేవలం రూ.5లకే అందించేందుకు డిసైడ్ అయ్యింది. గడిచిన కొద్దికాలంగా సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం పలు ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిం . దీంతో చిన్న ఊళ్లలో కనిష్టంగా రూ.5కే మూవీ టికెట్ లభించనుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లును ఆమోదించిన దరిమిలా మూవీ టికెట్ల కొత్త రేట్లను బుధవారం ప్రకటించింది. ఏపీలో మూవీ టికెట్ ధర.. కప్పు ‘టీ’ ధర కంటే తక్కువ ఉండటం గమనార్హం. ఏపీలో మూవీ టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రకటించారు.
తాజాగా విడుదల చేసిన ఆదేశాల్ని చూసినప్పుడు.. మూవీ ఇండస్ట్రీ తో పాటు.. థియేటర్ల యాజమాన్యాలకు షాక్ తినేలా టికెట్ల రేట్లు ఉన్నాయి. కార్పొరేషన్ల పరిధిలోని మల్టీఫ్లెక్సుల్లో ప్రదర్శించే మూవీ టికెట్ల ధరలకు ఫర్వాలేదనే స్థాయిలో ఉంటే.. చిన్న గ్రామాల్లోని థియటర్ల వారికి కరెంటు ఖర్చులు కూడా వస్తాయా? అన్న సందేహాన్ని కలిగించేలా టికెట్ల రేట్లు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.