మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల పూణే లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చెర్రీ, కియారా అద్వానీ పై ఓ పాట, కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ మూవీలకి సంబంధించి తన వర్క్ కంప్లీట్ చేసిన రామ్ చరణ్ .. ఇప్పుడు శంకర్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఇందులో చరణ్ ఐఏయస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో, ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ మూవీ ఉండబోతోందట. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం #RC15 లో విలన్ గా మలయాళ విలక్షణ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆయన పొలిటీషియన్‌గా నటించబోతున్నారట. మాలీవుడ్ లో పోలీస్, యాక్షన్ మూవీలకు కేరాఫ్ అడ్రెస్ ఆయన. ఇంతకు ముందు శంకర్ మూవీ ‘ఐ’ లో పాలిష్డ్ విలన్ గా మెప్పించిన ఆయన ఇప్పుడు మళ్ళీ శంకర్ మూవీతోనే, అందులోనూ రామ్ చరణ్ తో మొదటి సారిగా వర్క్ చేయనుండడం ఆసక్తిరేపుతోంది. నిజానికి, కృష్ణంరాజు ‘అంతిమ తీర్పు’ మూవీతో నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు సురేశ్ గోపి. ఆ తర్వాత అజయ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కడు’ మూవీలోనూ నటించారు. 12 ఏళ్ళకు మళ్ళీ #RC15తో టాలీవుడ్ లో విలన్ గా నటిస్తుండడం విశేషంగా మారింది. అలాగే.. ఇందులో సురేశ్ గోపి భార్యగా బాలీవుడ్ నటీమణి ఇషా గుప్తా కూడా నటిస్తున్నట్టు సమాచారం. మరి సురేశ్ గోపీ ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో విలన్ గా బిజీ అవుతారేమో చూడాలి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న 50వ చిత్రమిది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్‌చంద్ర, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ – మోనిక, రచన: సాయిమాధవ్ బుర్రా, సు.వెంకటేశన్ – వివేక్ (తమిళం), పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్, వివేక్ (తమిళం).