బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ థియేటర్లోకి వచ్చిందంటే అభిమానులకు పండగే. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన’అంతిమ్..ది ఫైనల్ ట్రూత్’ మూవీ విడుదలైంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు. నవంబర్ 26 న విడుదలైన మూవీలో ఆయుష్ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. అల్టిమేట్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే మంచి స్పందన వస్తోంది.
ఇక విషయానికి వస్తే..ఒక్కోసారి అభిమానులు రెచ్చిపోయి హద్దులు మీరుతుంటారు. అటువంటి ఘటనే అంతిమ్ మూవీ ప్రదర్శిస్తోన్న ఓ మూవీ థియేటర్‌లో చోటు చేసుకుంది. థియేటర్‌లో వందలాది మంది కూర్చొని ఉండగా అభిమానులు బాణసంచా కాల్చుతూ పండుగ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సల్మాన్ అభిమానులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తన అభిమానులను సల్మాన్ ఖాన్ కోరారు. మీరు ఇలాంటి పనులు చేసి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇదే విషయంపై థియేటర్ యజమానులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆడిటోరియం లోపలికి పటాకులు కాల్చడానికి అనుమతించవద్దని కూడా ఖాన్ థియేటర్ యజమానులను కోరారు.
మూవీని ఎంజాయ్ చేయండి కానీ ఇలా కాదు. అభిమానులకు ఇదే నా రిక్వెస్ట్… దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ధన్యవాదాలు అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.