టీ20 వరల్డ్ కప్ 2021: మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఇచ్చిన టార్గెన్‌ను 18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది సౌతాఫ్రికా. మర్క్రమ్ అర్ధ సెంచరీతో(51) అదరగొట్టి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలమైన మ్యాచులో సౌతాఫ్రికా టీం విజయం సాధించి, సూపర్ 12లో తన స్థానాన్ని సేఫ్ జోన్‌లో ఉంచుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ఓపెనర్ లూయిస్ (56) హాఫ్ సెంచరీతో రాణించినా.. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ పొలార్డ్ (26), సిమ్మన్స్ (16) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీశాడు. రబాడ, నార్జే తలో వికెట్ సాధించారు.
అనంతరం 144 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బవుమా రెండు పరుగులకే రనౌట్‌గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్, వాండర్ డసేన్ (43) జాగ్రత్తగా ఆడారు. హెండ్రిక్స్ అవుటైనా మార్‌క్రమ్ (51) హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆండీ రసెల్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో హెసోయిన్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా ఇది వెస్టిండీస్ జట్టుకు వరుసగా రెండో పరాజయం. తొలి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది.