TDP vs YCP: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్యంసం సృష్టించారు. ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మనేని పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం.. అక్కడికి చేరుకొని టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, అశోక్‌బాబు, పట్టాభి తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. దాడి విషయం తన దృష్టికి రాలేదని అమిత్ షా తెలిపినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. టీడీపీ కార్యాలయానికి, నేతల ఇళ్లకు కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని అమిత్‌షా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాగా.. ఈ రోజు ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై పట్టాభి ఈ వ్యాఖ్యలు చేశారు.