Cobra Movie Trailer : బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం పాత్రలను పోషించే నటుడు చియాన్ విక్రమ్. ‘అపరిచితుడు’, ‘ఐ’ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తాజాగా విక్రమ్ నటించిన మూవీ ‘కోబ్రా’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఆర్. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ ఈ మూవీని నిర్మించాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. మూవీపై భారీగా అంచనాలను పెంచుతోంది.
‘కోబ్రా’ మూవీ(Cobra Movie)లో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. అసాధ్యమైన కేసులను తన గణిత మేధస్సుతో పరిష్కరించే వ్యక్తిగా అలరించనున్నాడు. ట్రైలర్‌లో విక్రమ్ విభిన్న గెటప్పుల్లో కనిపించాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హై ఆక్టేన్ యాక్షన్ స్టంట్స్ కనిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారిగా ఈ మూవీలో నటించాడు. అతను ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ మూవీలో మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నాడు.