Akhanda Pre Release Event : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో శిల్పకళ వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళిలు గెస్టులుగా వచ్చారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. గెస్టులుగా హాజరైన అల్లు అర్జున్, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ కు.. అల్లు రామలింగయ్యకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో.. కరోనా ప్రభావం తర్వాత సినిమా రంగం కాస్త ఇబ్బంది పడుతోందని చెప్పారు. ఇక ఈ మూవీ గురించి తాను ఎక్కువగా చెప్పనని, ఎలా ఉంటుందో మీరు చూస్తారని పేర్కొన్నారు.
తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పవారని, తమ్ముడు అల్లు అర్జున్ ఇంతకుముందే తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకతను వివరించారని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశీర్వదిస్తారని బాలయ్య పేర్కొన్నారు. నటుడు ఏ పాత్ర అయినా చేస్తాడని, నటన అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమేనని, శ్రీకాంత్ అలవోకగా నటించారని కొనియాడారు. చిరంజీవి చేస్తున్న ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న RRR.. ఇలా చాలా మూవీస్ విజయవంతం కావాలని బాలకృష్ణ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
అలాగే.. మూవీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉందని.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మూవీ ఇండస్ట్రీకి అండగా నిలవాలని ప్రత్యేకంగా బాలయ్య విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా.. దాదాపు రెండేళ్ల పాటు టాలీవుడ్ ఇబ్బందుల్లో పడిందని.. ఇప్పుడు మళ్లీ వరుసగా మూవీస్ వస్తున్నాయని చెప్పిన బాలయ్య.. ప్రభుత్వాల అండతో.. మూవీ ఇండస్ట్రీ కోలుకోవాలని అన్నారు.