కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన మూవీల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై మెరిసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది ‘జీ 5’. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. సూరిబాబు పాత్రలో సుధీర్ విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీదేవి పాత్రలో ఆనంది ఒదిగిపోయింది.
పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన గొప్ప మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఇప్పుడీ మూవీను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘జీ 5’. ఓటీటీ ‘జీ 5’లో తమ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల అవుతుండటం సంతోషంగా ఉందని చిత్రబృందం తెలిపింది.